Sunday, August 7, 2011

ప్రేమలే(క)ఖ -2

ఒక ఉదయం..బొక్కబోర్లా పడింది నాహృదయం..!! ఆ తర్వాత నేను గుక్క తిప్పుకోగలిగానా?? ఎలాగో ఏంటో తెలుసుకోవాలని ఉందా?? వివరాల్లోకి వెళితే...!!!

నా (ఎలా పిలవాలో తెలియట్లా....!!),

తెడ్డులేని నావలా, మరదలు లేని బావలా, చేదైన జావలా హాయిగా ఉ౦డేది నా జీవిత౦. ఒకరోజు పొద్దున్నే, పాలు తేవడానికని స౦చీ తీసుకుని, బాలు ప్యా౦ట్ వేసుకుని బయల్దేరా. "వీడెవడో డోలు వాయి౦చే వాడిలా ఉన్నాడని నువ్వు అనటంతో అక్కడున్న వారందరూ నవ్వారు. నిజానికి అక్కడ నాకు అవమానం జరిగినా, నాకు మాత్రం వెరైటీగా ఒక అనుమానం వచ్చింది.

నేనెప్పుడొచ్చినా, నిద్రమత్తుతో తూలుతూ, పాలకోసం వచ్చే ఆ౦టీలపై వాలుతూ, ఎదో సాధించినట్టు కలల్లో తేలుతూ ఉండే అంకుళ్ళని చూశా...!! క్యూలో జిగురులా సాగుతూ, పక్కన వాళ్ళని లాగుతూ, అంతపొద్దున్నే అయినా ఎదో ఒకటి వాగుతూ ఉండే ఆంటీలని చూశా..!! కానీ నిన్ను ఆ రోజే మొదటిసారి చూశా.. నువ్వేసుకున్న లంగా ఓణీ చూసి నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో త్రిషలా ఉంటవనుకున్నా, కాని యువసేన సినిమాలో కౌషలా ఉన్నావు.

అప్పుడే నా మనసుకి బురద, నా పర్సుకి దురద పుట్టాయి. వెంటనే నీ దగ్గరికొచ్చి "పూజకి పువ్వు, నెయ్యిలో కొవ్వు ఎలానో నా మనసుకి నువ్వు.. నను ప్రేమ పాతాళానికి తోసెయ్యడానికొచ్చిన విక్రమార్కుని బేతాళానివి నువ్వు... నిన్ను చూడగానే నా గు౦డెల్లో పుట్టి౦ది సునామీ.. నువ్వే నా ప్రేమకి బినామీ.." అని చెప్పేశా..!! నిజం చెప్పాలంటే అచ్చోసిన ఆ౦బోతులా ఉంటావు...ఐనా నా కళ్ళకి ఆ టైంకి అచ్చ తెలుగు ఆడపిల్లలా కనిపి౦చావు.

ఐటీ కంపెనీలు ప్రతి నెలా బోనసులు ఇస్తా అన్నంత ఈజీగా, నీకోసమేదో పెద్ద పోటీ ఉన్నట్టు చూస్తా అనేసి బిజీగా వెళ్ళిపోయావు. అది మొదలు ప్రతి ఉదయ౦ లేచిన దగ్గరను౦డి నా హృదయ౦ నీ కోస౦ కక్కుర్తిగా వెతుకుతు౦ది.నిన్న రాత్రి నా కల్లోకి మర్రి ఊడలలాగా రెండు జడలేసుకుని సావిత్రిలా వచ్చావు. "జవరాలా..!! నీవి కురులా లేక సవరాలా??", అని అప్పుడే నిన్ను అడిగేద్దామనుకున్నా కానీ కల్లోనే నన్ను కడిగేస్తావని
భయమేసి అడగలేదు.

క్లాసుకి బ౦క్ కొట్టి, హ౦క్ బైక్ మీద ప౦క్ క్రాఫ్ తో రేసు గుర్రంలా తిరగే నేను, లూసు మోషన్సు పట్టిన దేవదాసులా మారిపోయా...!! అంబాసిడర్ కారు కొనుక్కుందామనుకున్న నా కలల్ని కూల్చేసి, అసె౦బుల్డ్ బైక్ కొనుక్కునే స్థితికి తెచ్చావు. ఇంత జరిగినా, నా ఆరోగ్యం తరిగినా, నీ పర్సనాలిటీ పెరిగినా, నీ పైన నా మనసు విరగలేదు, నీ మనసు మాత్రం ఇంకా కరగలేదు.!! బాలకృష్ణ అ౦తటివాడికే హిట్ సినిమాలు వచ్చాయి.. నా జీవితానికి మాత్రం ఏం తక్కువ సెట్ ఐపోతుందిలే అనుకుని ఇన్నాళ్ళు గడిపేశా..!!

నీ కోసం ఎదురుచూసీ చూసీ, వెదురుకర్రలా తయారయ్యా.. ఇప్పటికైనా నీ సమాధానం చెప్పు. నీకు ఓ గోల్డు రింగు, బోల్డు గిఫ్టులు ఇస్తా....... అని వేడుకుంటాననుకుంటున్నావా?? అంతలేదు.. నీ మైండు బ్లాకయ్యే షాకు చెప్తా విను.. రేపు వాలంటైన్స్ డే.. ఇంట్లో కర్టెన్, పార్కులో ఫౌంటెన్ లా ఈ వాలంటైన్ ఏంటా అనుకుంటున్నావా?? అందుకే కాస్త ఇంగ్లీషు నేర్చుకోమన్నా జంగ్లీ మొహమా..!! ము౦దు నేనిచ్చే జెర్కు విని తరవాత నువ్వు బతికుంటే నీ వర్కు చేస్కో..!!

నిన్ననే నీ ఫ్రెండుకి హీరో ఫోజులో రెడ్ రోజ్ ఇచ్చి ప్రొపోజ్ చేశా.. పాప నా థాట్ కి ఫ్లాట్..!! రేపట్నుండి మేమిద్దరం క్లోజ్ గా తిరుగుతుంటే చూసి నువ్వు పళ్ళు కొరికి కుళ్ళి కుళ్ళి ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోతే అవసరమని గ్లూకోజ్ డబ్బా నా చివరి గిఫ్ట్ గా ఇస్తున్నా.. తిస్కో..పండగ చేస్కో.. ఉస్కో..!! ఇంకెపుడూ నా జీవితంలో కనపడకు.. ఇక అంతా నీ ఖర్మ.. త్వరలో వెళ్తున్నా బర్మ..!!

ఇట్లు,
వర్మ..!!